కారుణ్య నియామకాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం తగదు
- సాధారణ నియామకాలకు సమాంతరంగా కారుణ్య నియామకాలతో ఉద్యోగాలు భర్తీ చేయాలి
- ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్
అమరావతి ( జర్నలిస్ట్ ఫైల్ ) : రాష్ట్రంలో పలు ప్రభుత్వ శాఖల్లో పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని ఎస్సీ,ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దేవరపల్లి సురేష్ పేర్కొన్నారు.పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ ఆఫీసర్ గా పనిచేసి రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మరణించిన తాడేపల్లికి చెందిన మిశనం నాగరాజు భార్యకు ఇంతవరకు ఎలాంటి ఉద్యోగం ప్రభుత్వం ఇవ్వకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశమన్నారు.నాగరాజు భార్య సుజాత శనివారం సురేష్ బాబుని కలిసి తన సమస్య పరిష్కారానికి సహకరించాలని కోరారు.ఈసందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తూ మరణించిన నాగరాజు భార్య సుజాత కారుణ్య నియామకం ద్వారా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని పలుమార్లు పంచాయతీరాజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం చుట్టూ రెండు సంవత్సరాలుగా తిరుగుతున్నప్పటికీ అధికారులు కనీసం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ విధులు నిర్వహిస్తూ మరణించిన కుటుంబాలకు చెందిన బాధితులకు కారుణ్య నియామకం ద్వారా వెంటనే ఉద్యోగం ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.సాధారణ ఉద్యోగ నియామకాలతో పాటు సమాంతరంగా కారుణ్య నియామకాలను కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని కోరారు.మరణించిన ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం,భద్రత ప్రభుత్వ కనీస బాధ్యతగా భావించి తక్షణమే కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు.పంచాయితీరాజ్ శాఖలో పెండింగ్ లో ఉన్న ఇలాంటి సమస్యలను తక్షణమే పరిష్కరించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపాలన్నారు.సుజాత సమస్యను అసోసియేషన్ పక్షాన పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సురేష్ బాబు తెలిపారు.

